రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.50 లక్షల వరకూ నగదు రహిత ఉచిత చికిత్సను అందించడానికి వీలుకల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని పేర్కొంది. ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. నిర్దేశిత ప్రమాణాలు కలిగి, నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. పోలీసులు, ఆసుపత్రులు, స్టేట్ హెల్త్ ఏజెన్సీల సహకారంతో ‘రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం 2025’ను జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) అమలు చేస్తుంది. రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.పథకం అమలు, ఆసుపత్రులను పథకంలో చేర్చడం, బాధితులకు చికిత్స, ఆసుపత్రులకు చెల్లింపులు తదితర అన్ని విషయాలను ఎన్‌హెచ్‌ఏతో సమన్వయం చేసుకొనే బాధ్యత ఈ నోడల్ ఏజెన్సీదే. పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

