హైదరాబాద్ కేకే మీడియా ఆగస్ట్ 29 :
హైడ్రా తన నెక్స్ట్ టార్గెట్ ను దుర్గం చెరువు కు మార్చినట్లుగా తెలుస్తోంది.గండిపేట, హిమయత్ సాగర్‌ల పరిధిలో భూ ఆక్రమణ దారుల భరతం పడుతున్న హైడ్రా అధికారులు తాజాగా తమ ఫోకస్ దుర్గం చెరువు పై పెట్టారు. దుర్గం చెరువు పరిసరాలు ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా మారిపోయాయి. మాధాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల పరిధిలో ఈ చెరువు పరిధి విస్తరించి ఉంది. ఇప్పటికే చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో నగరంలోనే బడా బాబులు వెలుగొందుతున్న వ్యక్తులు విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని ఉన్నారు. అసలు చెరువును ఆనుకునే ఎన్నో భవనాలు వెలిశాయి. చెరువుల ఎఫ్ టి ఎల్ జోన్ పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఇప్పటి్కే గుర్తించారు. ఇందులోభాగంగా 204 మందికి శేరిలింగంపల్లి తహసిల్దార్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలకు 30 రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ జోన్ పరిధిలోనే నిర్మించిన ఒక ఇంటిని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కొనుగోలు చేశారు. అయినా కూడా తహసిల్దార్ నోటీసులు జారీచేశారు. నెక్లార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరీ హిల్స్, అమర్ కోఆపరేటివ్ సొసైటీల్లోని నివాసదారులకు అధికారులు నోటీసులు జారీచేశారు.