సాగర్ నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలి: కిసాన్ మోర్చా
నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 3
హుజూర్నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి పదవి చేపట్టడంతో ఒక దఫా అయినా సాగునీరు వస్తుందన్న ఆశతో నియోజకవర్గ అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని నేరేడుచర్ల మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు తాళ్ల నరేందర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ సాగునీటి అధికారులతో మాట్లాడగా మాకు ఇప్పటి వరకు పాలేరు రిజర్వాయర్ నింపడానికి మాత్రమే ఆదేశాలు వచ్చాయని తెలిపారని అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నిండిన తర్వాతనైనా హుజూర్నగర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపడానికి ఒక దఫా నీరు ఇచ్చి రైతన్నలను ఆదుకోవాలని కోరారు. యాసంగి పంట పొట్ట దశకు వచ్చినా ఇంకా పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించే రైతుబంధు అందక అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక దఫా సాగర్ నీరు రాకపోతే వరి పంటలు ఎండిపోయి, రైతులు ఆర్థికంగా నష్టపోయే ఆస్కారం ఉంద న్నారు.