సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి :
మంత్రి ఉత్తమ్ కు రైతు సంఘం వినతి
నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 2
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు, ఎస్ఎల్బీసీ, వరద కాలువకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా సాగు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రానున్న వేసే కాలంలో ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో 30% మేరకు వరి పంట సాగు చేశారని, బోర్లు బావుల మీద ఆధారపడి పంటలు వేశారని తెలిపారు.తీవ్ర వర్షాభావo కారణంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసుకున్న రైతులు తమ పంట పొలాలకు నీళ్లు అందకపోవడంతో తీవ్ర మనోవేదన గురవుతున్నారని అన్నారు. పంట పొలాలు బీడ్లుగా మారాయని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు తక్షణమే చెరువులు, కుంటలు నింపాల్సిన అవసరం ఉందన్నారు.ఎడమ కాలుకు నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపాలని కోరారు. అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి ద్వారా నీటిని తెప్పించి నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని కోరారు. చెరువులు, కుంటలు నింపితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. స్పందించిన మంత్రి సంబంధిత ఎన్ఎస్పి ఎస్ఈ కు ఫోన్ చేసి నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల సిపిఎం కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరపల్లి వెంకటేశ్వర్లు, బండ శ్రీశైలం, పారేపల్లి శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.