నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్26:
శ్రీరామనవమి సందర్భంగా
నేరేడుచర్ల శ్రీ అయోధ్య కోదండ రామాలయానికి శ్రీరామ నామాలు కలిగిన తలంబ్రాల బియ్యపు గింజలను హైదరాబాదు చందానగర్ కు చెందిన శ్రీరామ భక్తురాలు చలువాది మల్లి విష్ణువందన ఆదివారం ఆలయ ధర్మకర్త పాల్వాయి రమేష్ అనిత దంపతుల కు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు వందన మాట్లాడుతూ 2016 నుండి బియ్యపు గింజలపై పవిత్ర శ్రీరామ నామాలను తన స్వహస్తాలతో లిఖిస్తున్నానన్నారు. ఇప్పటివరకు 7 లక్షల 52 వేల 864 బియ్యపు గింజలపై అకుంఠిత దీక్షతో లిఖించానన్నారు. లిఖించిన బియ్యపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని 30 ఆలయాలకు పైగా అందచేశానన్నారు.ఈ నెల 30న భధ్రాద్రి ఆలయంలో నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణ వైభవం లో ఉపయోగించే తలంబ్రాల కొరకు 1,01,116 బియ్యపు గింజలను అందజేశానన్నారు. వీటితో పాటుగా మరో 36 వేల శ్రీరామ నామాల బియ్యపు గింజలను ఆంధ్రప్రదేశ్ లోని ఆళ్లగడ్డ, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాదు మరియు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట ప్రాంతాల్లోని 7 దేవాలయాల్లో నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం కొరకు సిద్దం చేశానని అవి కూడా పంపిణీ చేస్తానన్నారు. నేరేడుచర్ల అయోధ్య కోదండ రామాలయానికి 5 వేలు, నూతనంగా నిర్మించిన గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ దేవాలయానికి 3 వేలు దిర్శించర్ల గ్రామంలోని రామాలయానికి 10వేల గింజలను అందజేసినట్లు వివరించారు.ఇలాంటి కార్యక్రమాలతో నేటి యువతకు భగవంతుని పట్ల మక్కువ చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరిలో చిన్నతనం నుండే ఆధ్యాత్మిక చింతనకు దగ్గర చేయాలన్న సదుద్ధేశంతో బియ్యపు గింజలపై సూక్ష్మ కళతో శ్రీరామ నామాలను లిఖిస్తున్నాని తెలిపారు.