హుజూర్నగర్ కేకే మీడియా జులై 20
రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన రాజకీయ ఉద్దండులు ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గంలో బిసి లు బిగ్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనాభాలో సింహభాగం ఉన్న బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు పలువురు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు తమ కార్యకలాపాలు ముమ్మరం చేస్తూ చాప కింద నీరులా పాకే ప్రయత్నం చేస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం హుజూర్నగర్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే రాజకీయం గా ఆధిపత్యం ప్రదర్శిస్తూ అధికారం గుప్పెట్లో పెట్టుకున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో
కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన విషయం విధితమే. తదనంతరం హుజూర్నగర్ కు జరిగిన ఉప ఎన్నికలలో
అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శానంపూడి సైదిరెడ్డి ఉత్తం సతీమణి పద్మావతి పై విజయం సాధించారు. మూడుమార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఒక మారు టిఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ ను కైవసం చేసుకుంది. నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్టీ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఎవరూ రాజకీయంగా రాణించలేకపోయారు. గతంలో ఇతర ప్రాంతాల నుండి దిగుమతి అయిన ఇరువురు నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వంగాల స్వామి గౌడ్, టిఆర్ఎస్ పార్టీ నుంచి కాసోజు శంకరమ్మ లు పోటీ చేసినప్పటికీ
స్థానికేతరులు కాకపోవడంతో చతికిలబడి గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. తాజాగా జరగబోయే ఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఒకరిద్దరు ఆర్థికంగా బలమున్న నేతలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు పావులు కదుపుతున్నారు.
మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లుట్ల రఘు ఓజో ఫౌండేషన్ పేరుతో గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ ఇప్పటికే నియోజకవర్గ ప్రజలకు సంకేతాలు అందించారు. ఇదే కోవలో మరో బిసి నాయకుడు నేరేడుచర్ల గ్రామానికి చెందిన తంగేళ్లపల్లి విద్యాసాగర్ ఎన్నారైగా వ్యాపారంలో సక్సెస్ సాధించి తన నియోజకవర్గ ప్రజలకు తన వంతు సహకారం అందించాలని నియోజకవర్గంలోని తన మిత్ర బృందం ద్వారా పేదలకు పలు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ అధిష్టానం అవకాశమిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్న సంకేతాలు వెలువడేలా ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు సంకేతాలిస్తున్నారు. ఇరువురు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం ఆర్థికంగా బలవంతులు అవడం తో ఈసారి నియోజకవర్గంలో బలంగా ఉన్న బీసీ సామాజిక వర్గం బీసీలకు మద్దతు ప్రకటిస్తే వీరికి తోడు నియోజకవర్గంలో బలంగా ఉన్న మరో సామాజిక వర్గం గిరిజనులు, ఎస్సీల మద్దతు కూడగట్టుకుంటే కోటి రసవత్తరం కానున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి పెద్ద నేతలుగా ఎదగాలని అనుకున్న నాయకులు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఆయా పార్టీల అధిష్టానం నుంచి సరైన అవకాశం లభించకపోవడం ఆర్థికంగా బలంగా లేకపోవడం తో ఇప్పటివరకు పోటీలో నిలిచే సాహసం చేయలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలు రాజ్యాధికారం కోసం పలు సంఘాలుగా చేస్తున్న ప్రయత్నాలలో వివిధ వ్యాపార రంగాలలో ఆర్థికంగా స్థిరపడ్డ బీసీ లు ఒక్కరొక్కరుగా తమ తమ నియోజకవర్గాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు
వస్తున్నా రు.ఈ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో కూడా ఈ ఇరువురు నేతలు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులతో చర్చలు జరుపుతూ సమరానికి సై అనే సంకేతాలు అందిస్తున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ హుజూర్నగర్ నియోజకవర్గ రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారబోతున్నాయో అదృష్టం ఎవరిని వవరించబోతుందో వేచి చూడాల్సిందే.