హైదరాబాద్:నవంబర్ 30
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ వేదికగా రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించ నున్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులను నేడు విడుదల చేయనున్న ట్లు సమాచారం. దాదాపు 3 లక్షల మంది రైతులకు రూ.3 వేల కోట్లను నాలుగో విడతగా రాష్ట్ర సర్కార్ అందించనుంది.
రైతు పండుగ ముగింపు వేడుకల భారీ బహిరంగ సభకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఏడాది పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు సభా వేదికగా ముఖ్యమంత్రి ధీటైన సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపునకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలోనే అమిస్తా పూర్లో నిర్వహించే బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రైతు పండుగ వేడుకలను సర్కారు నిర్వహిస్తోంది.
అత్యాధునిక సాగు పద్ధతులు, లాభసాటి పంటలు వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక పోకడలపై కర్షకులకు అవగాహన కల్పించేందుకు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మూడో రోజు కార్యక్రమాలు కొనసాగనుం డగా, ఉమ్మడి జిల్లా సహా చుట్టు పక్కల జిల్లా నుంచి రైతులను రప్పిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో అమిస్తాపూర్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి, తొలుత రైతు పండుగ ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.