Thursday, March 20, 2025
HomeNationalమరో అల్పపీడనం

మరో అల్పపీడనం

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అనగా దక్షిణ ఆంధ్రప్రదేశ్-ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఎగువ వాయు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం సహా దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు జిల్లాలతో సహా రాయలసీమలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రానున్న రెండ్రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే ప్రధాన పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD కోరింది. విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారిణి సుధావల్లి మీడియాతో మాట్లాడుతూ రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నందున, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఆమె పౌరులను కోరారు. మరోవైపు తెలంగాణలోను శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు చోట్ల చల్లని గాలులతోపాటు, వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పలు చోట్ల వరి ధాన్యంతో పాటు ఇతర పంటలు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments