కేకే మీడియా ఏపీ సెప్టెంబర్ 4
చెరువులు, ఇతర జల వనరుల పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగకుండా పటిష్ట చట్టాన్నిరూపొందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద నీరు విలయం సృష్టించడానికి బుడమేరు వంటి జల వనరులు యధేచ్ఛగా దురాక్రమణలకు గురి కావడమే కారణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చెరువుల దురాక్రమణలను అరికట్టడానికి తీసుకొచ్చిన హైడ్రా తరహా వ్యవస్థ ఏపీలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చూపిన తెగువను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. చెరువుల పునరుజ్జీవానికి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపు మంచిదే అయినా కూడా నష్టపోయినా వారిలో సామాన్యులు ఉంటే వారికి పరిహారం అందించేలా రేవంత్ ప్రభుత్వం ఆలోచన చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. నిర్మాణాల తొలగింపుతో సరికాదని, మళ్లీ అక్కడ కట్టడాలు వెలియకుండా పటిష్ట చట్టం తేవాలని ఆయన సూచించారు. మరో ప్రభుత్వం వచ్చినా పరిరక్షణే ధ్యేయంగా చట్టాలు ఉండాలని పేర్కొన్న ఆయన తెలంగాణలో ఇప్పట్లో మరో ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదని తేల్చిచెప్పారు.