నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 28
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తన గెలుపు ఖాయమని, భారీ మెజార్టీతో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి 60 నుంచి 70 కోట్ల రూపాయల నిధులు తెచ్చానని,నేరేడుచర్ల మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా మారుస్తాననిఅన్నారు.మంగళవారం పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. నేరేడుచర్ల ఉన్న డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన రాకుండా ఏర్పాటు చేస్తానని అన్నారు. మండలానికి అధిక సంఖ్యలో ముఖ్యమంత్రి సహాయ నిధులు, ఎల్ ఓ సి నిధులు ఇప్పించినట్టు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. నేరేడుచర్ల అభివృద్ధి చెందుతున్న వ్యాపార కేంద్రమని, నేరేడుచర్ల భవిష్యత్తుకు రోడ్డు వెడల్పు చేసామని అన్నారు. పట్టణములో మంచినీటి సమస్యలను తీరుస్తానని, నేరేడుచర్లకు రింగురోడ్డు ఏర్పాటు అవుతుందన్నారు. ఉత్తంకుమార్ రెడ్డికి అభివృద్ధి పట్టదని, 100 ఫోన్లు చేస్తే, ఒక ఫోన్ కు కూడా సమాధానం ఇవ్వరని ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీ సోదరులకు ఖాబరస్థాన్, మైనార్టీ పాఠశాలాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు చెప్పారు. 100 కోట్ల రూపాయలతో నేరేడుచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని తెలిపారు. హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల అభివృద్ధికి ఓటేసి గెలిపించాలని కోరారు. వరుసగా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 18 సార్లు నీటిని విడుదల చేశామన్నారు. గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందని, మూసి నదిపై ఆరు చెక్ డాములు నిర్మించినట్లు తెలిపారు. నేరేడుచర్లకు మున్సిఫ్ కోర్టు, మైనార్టీ గురుకుల పాఠశాల, డిగ్రీ కాలేజీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. త్వరలో నేరేడుచర్లలో ఇండోర్ స్టేడియం, పార్కు, సమీకృత మార్కెట్ భవనం, దోబిగాట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని, కోలాటం నృత్యాలు చేశారు. పట్నం అంతా ఒక్కసారిగా గులాబీమమైంది. ర్యాలీలో బీఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ, మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనతం సత్యనారాయణ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పి రెడ్డి, కౌన్సిలర్లు అలక సరిత సైదిరెడ్డి, నాయకులు వల్లం చెట్ల రమేష్ బాబు, యామిని వీరయ్య, గుర్రం మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.