హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 8:
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (80) మరణించడం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఆయన చిత్రపటానికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పూలమాలవేసి నివాళులర్పించారు. ‘జోహార్ బుద్ధదేవ్ భట్టాచార్య, సాధిస్తాం ఆయన ఆశయాలను’అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ బుద్ధదేవ్ భట్టాచార్య మరణించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. ఆయన యువజనుడిగా ఉన్నప్పటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. సుదీర్ఘకాలంపాటు మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్‌కు సేవలందించారని వివరించారు. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించానికి, పరిశ్రమలను నెలకొల్పడానికి క్రియాశీలకపాత్ర పోషించారని అన్నారు. ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, జాన్‌వెస్లీ, టి సాగర్, పి ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె బాబురావు, ప్రజాసంఘాల నాయకులు కోట రమేష్, మూడ్ శోభన్ నాయక్ తదితరులు పాల్గొని బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.