మేళ్లచెరువు కేకే మీడియా మే 10:
వివాదాస్పద ప్రభుత్వ భూముల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం
నిషేధిత జాబితాలో భూములు, అధికారులపై క్రిమినల్ కేసులు
అనుమతులు లేకుండానే భారీ అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి
గృహప్రవేశం చేసిన మైహోం హెచ్ఓడి లు
సెలవు పై పంచాయతీ కార్యదర్శి
ఆన్లైన్లో అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు జారీ చేస్తూ గ్రామపంచాయతీ అనూహ్య నిర్ణయం
బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరిగినట్లు వినికిడి
పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు అనుమానం…
చక్రం తిప్పిన అధికార పార్టీ నేత
*మేళ్లచెరువు:-* నిర్మాణం పూర్తయిన అపార్ట్మెంట్లకు నిర్మాణం చేపట్టుకోవడం కోసం ఇటీవల అనుమతులు జారీచేసిన విచిత్ర సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. అయితే అపార్ట్మెంట్లు నిర్మాణం చేసింది సర్వేనెంబర్ 1057లో గల వివాదాస్పద ప్రభుత్వ భూమిలో కావడం ఇక్కడ విశేషం. ఈ 1057 సర్వేనెంబర్ గల భూమిలో 150 ఎకరాల భూదాన భూమి, 18 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఈ భూమిపై ప్రభుత్వానికి-మైహోం సంస్థ మధ్య గడిచిన 10 సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.ఈ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది.ఈ భూములపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించడం నేరం. గతేడాది ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలకు, భూ కబ్జాకు సహకరించిన తహసిల్దార్, పంచాయతి కార్యదర్శి, ఇరిగేషన్ ఈఈ, విద్యుత్ ఏఈ సహా పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో 1057 సర్వేనెంబర్ గల భూముల్లో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు గతంలో పలుమార్లు నిర్మాణ పనులను అడ్డుకొని మైహోం కంపెనీకి నిర్మాణాలు నిలిపివేయాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.అక్రమ నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. గతేడాది ఆగస్టు నుండి 2023ఏప్రిల్ చివరివారం వరకు ఐదుసార్లు ఈ భూముల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం మైహోమ్ సిమెంట్ సంస్థ పెట్టుకున్న దరఖాస్తులను గ్రామపంచాయతీ పాలకవర్గం తిరస్కరించింది.
*ఎట్టకేలకు అపార్ట్మెంట్ నిర్మాణాలకు ఓకే*
అధికార పార్టీ బడానేత ఒత్తిడితో హుటాహుటిన ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు మేళ్లచెరువు గ్రామపంచాయతీ అనుమతులు మంజూరు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తిస్థాయిలో లేఔట్ ఫీజు, బ్లూ ప్రింట్, నాలా పర్మిషన్, 15% భూమి గ్రామపంచాయతీ పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయనప్పటికీ ఈ భూముల్లో నిర్మాణాలకు పంచాయతీరాజ్ శాఖ అనుమతించింది. వాస్తవానికి ఈ భూముల్లో 2 నెలల క్రితమే మైహోమ్ సంస్థ 5 ఎకరాల్లో 6 అంతస్తులో అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తిచేసింది. భూములపై కోర్టు కేసులు, వ్యక్తిగతంగా అధికారులపై ఉన్న క్రిమినల్ కేసులను సైతం లెక్కచేయకుండా గతంలో ఐదు సార్లు తిరస్కరించిన దరఖాస్తును ఒక్కసారిగా అనుమతులు మంజూరు మంజూరు చేయటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రిస్క్ అని తెలిసినా అనుమతులు మంజూరు చేశారంటే ఈ అనుమతులు వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకవర్గం సైతం అత్యవసర సమావేశం పెట్టి అనుమతులు మంజూరుకు సహకరించినట్లు తెలుస్తుంది.
*దొంగల చేతికి పంచాయతీ తాళాలు*
నిర్మాణ అనుమతులు ఇవ్వటానికి ఎటువంటి అవకాశం లేని ప్రభుత్వ, వివాదాస్పద భూముల్లో మైహోం సంస్థ అపార్ట్మెంట్లు నిర్మాణం చేస్తుందని గ్రామపంచాయతీ ఆ నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని సంబంధిత మేళ్లచెరువు పంచాయతీ కార్యదర్శి ఇర్లా నారాయణరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అనుమతులు జారీ చేసే అవకాశం లేనందునే గతంలో మైహోం సంస్థ ఎండి జూపల్లి రంజిత్ రావు ఈ పంచాయతీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పెట్టుకున్న దరఖాస్తును ఐదుసార్లు తిరస్కరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భూములపై కోర్టు కేసులు, ప్రభుత్వ భూమి, భూదాన్ భూముల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఓసి కోసం తాసిల్దార్ ని సంప్రదించగా ఇప్పటివరకు ఎటువంటి క్లియరెన్స్ పత్రం జారీ చేయలేదన్నారు.అయితే ఇటీవల ఆన్లైన్లో అపార్ట్మెంట్ల భవన నిర్మాణ అనుమతుల కోసం మైహోమ్ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును గ్రామపంచాయతీ కార్యాలయం అప్రూవల్ ఇవ్వలేదని, కేవలం ఉన్నతాధికారులకు బదలాయించినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఆన్లైన్లో అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం అప్రూవల్ తాను చేయలేదని కొద్ది రోజులుగా సెలవులో ఉన్నట్లు పంచాయతీ సెక్రటరీ చెప్పుకొచ్చారు.
*అడుగడుగునా అవినీతికి ఆద్యం*
మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీలో అడుగడుగునా అవినీతి రాజ్యం వెళుతుందని స్పష్టంగా తెలుస్తుంది. నిధుల ఖర్చు వ్యవహారంలో సైతం పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక పన్ను వసూల్లో, వెంచర్లు, లేఅవుట్ పర్మిషన్లో సైతం పెద్దవెత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని అర్థమవుతుంది. మైహోమ్ సిమెంట్ నిర్మాణాలకు సంబంధించిన పన్ను విధింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాచారం. మైహోమ్ నిర్మాణాలపై రివిజన్ చేపట్టి పూర్తిస్థాయిలో పన్ను వసూలు చేస్తామని పేర్కొన్న పంచాయతీరాజ్ జిల్లా అధికారులు గడిచిన 5 నెలలుగా మైహోమ్ నిర్మాణాలకు కొలతలు వేస్తూనే…. ఉన్నారు. ప్రస్తుతం మైహోం సంస్థ 27లక్షలు ఇంటి పన్ను చెల్లిస్తుండగా రూ.3కోట్ల వరకు పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ దీనిని తగ్గించేందుకు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామపంచాయతీకి 3కోట్లు పన్ను చెల్లించకుండా, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ పన్ను డబ్బులను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.