నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 18
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజాప్రతినిధులకు సమగ్ర సమాచారమివ్వాలని పలువురు ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లకుమల్ల జ్యోతి బిక్షం అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అధికారులు వరుస క్రమంలో ప్రగతి నివేదికలు చదివి వినిపిస్తుండగా పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంతు వచ్చింది. ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సెలవుపై ఉండడంతో హెల్త్ సూపర్వైజర్ వరమ్మ సమావేశానికి హాజరయ్యారు. గత డిసెంబర్ నెల నుండి ఫిబ్రవరి నెలాఖరువరకు ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. దీంతో పెంచికల్ దిన్నె ఎంపీటీసీ సభ్యుడు యల్లబోయిన లింగయ్య ప్రభుత్వ ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాల వివరాలను నివేదికలో ఎందుకు పొందు పరచలేదని ప్రశ్నించారు. సమావేశానికి కంటే వారం క్రితమే తాను కంటి వెలుగు కార్యక్రమాల నివేదికను ఇవ్వాలని కోరినట్లు సభ దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ సమాచారం ఇవ్వకుండా అధికారులు దాటవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును ప్రశ్నించే అధికారం తమకు లేదా అని అభ్యంతరం లేవనెత్తారు. దీంతో ఎంపీడీవో శంకరయ్య జోక్యం చేసుకొని ప్రజా ప్రతినిధులు ఎవరు సమాచారం కోరిన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని , మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి కంటి వెలుగు పథకం పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.నేరేడుచర్ల మండలంలో 26 రేషన్ దుకాణాలు ఉన్నాయని నూతనంగా ఖాళీగా ఉన్న ఐదు చోట్ల నూతన డీలర్ల నియామకం జరిగిందని తాసిల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల కొక్కెర రోగంతో నాటు కోళ్లు విపరీతంగా చనిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి తొలిసారిగా వ్యాక్సిన్ సరఫరా అయిందని మండలంలో పంపిణీ చేస్తామని పశువైద్యాధికారి రవి నాయక్ వెల్లడించారు. అనంతరం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన నేరేడుచర్ల వ్యవసాయం మార్కెట్ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ ను ఎంపీడీవో శంకరయ్య సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. తన నియామకానికి సహకరించిన హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో 17 మంది సర్పంచులకు గాను ఒకరు ఇద్దరు మినహా మిగతా సర్పంచులు గైర్హాజర్ కావడంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరై ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా కృషి చేయాలని వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ సభలో సూచన చేశారు కానీ సర్పంచులు తమకు దీర్ఘకాలికంగా నిధుల విషయంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడం మండల పరిషత్ సమావేశాలకు హాజరైన ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ సమావేశానికి ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరు అటువైపుగా రాకపోవడం కు కారణమని సర్పంచులు అంటున్నట్లు వార్తలు వినవచ్చాయి. ఈ సమావేశంలో ఎంపీటీసీలు మండల స్థాయి అధికారులు సర్పంచులు పాల్గొన్నారు.