Thursday, March 20, 2025
HomeTelanganaనా ఇల్లు సేఫ్.. ఆ ప్రాంతాల్లోని ఇండ్లపై వెలిసిన 'హైకోర్టు స్టే' ఫ్లెక్సీలు

నా ఇల్లు సేఫ్.. ఆ ప్రాంతాల్లోని ఇండ్లపై వెలిసిన ‘హైకోర్టు స్టే’ ఫ్లెక్సీలు

హైదరాబాద్ కేకే మీడియా అక్టోబర్ 15

హైదరాబాద్ నగరంలో ప్రజలను హైడ్రా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడంటే.. కాస్త దూకుడు తగ్గించింది కానీ.. మరోసారి హైడ్రా బుల్డోజర్లు టాప్ గేర్ వేసే అవకాశాలున్నాయి. తుపాను వచ్చే ముందు ఏర్పడే నిశ్శబ్దంలా.. హైడ్రా సైలెంట్ అయ్యిందని.. ఏదో ఓ రోజు గట్టిగానే కూల్చివేతలుంటాయన్న వార్తలు.. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని జనాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో.. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు కూడా టెన్షన్ పడుతున్నారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా.. చాలా వరకు ఇండ్లను కూల్చేయాల్సి వస్తుందని.. ప్రభుత్వం పదే పదే చెప్తోంది. అయితే.. కూల్చేసిన ఇండ్ల యజమానులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వటంతో పాటు పరిహారం కూడా చెల్లిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినా సరే.. చాలా మంది బాధితులు తమ నివాసాలను కూల్చేందుకు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే సర్వే నిర్వహించి.. కొన్ని ఇండ్లను గుర్తించి వాటికి ఆర్బీ-ఎక్స్ మార్కును కూడా వేశారు. అందులో కొంత మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా కేటాయించినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే.. చాలా మంది తమ నివాసాలను కూల్చేసేందుకు ససేమిరా అంటున్నారు. కూల్చివేతల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయకపోవటంతో.. మూసీ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇండ్లను కూల్చివేయకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే.. పలువురు బాధితులకు హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. దీంతో.. తమ ఇండ్లను కూల్చివేయొద్దని.. హైకోర్టు స్టే కూడా ఇచ్చిందంటూ తమ నివాసాలకు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఆ ఇండ్ల యజమానులు.

హైదరాబాద్‌ నగరంలోని చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో.. చాలా ఇండ్లకు హైకోర్టు నుంచి తెచ్చుకున్న స్టేకు సంబంధించిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఈ ఇల్లు పూర్తి రక్షణలో ఉందని.. అందుకు సంబంధించి హైకోర్టు ఆర్డర్‌కు సంబంధించిన రిట్ పిటిషన్ నెంబర్ కూడా ఫ్లెక్సీల్లో ముద్రించారు. ఫ్లెక్సీలైతో కొట్టుకుపోతాయనో.. ఎవరైనా తీసేస్తారనుకున్నారో.. ఏకంగా తమ ఇంటి గోడలకు పెయింట్‌తో రాసుకున్నారు. సుమారు 100 ఇండ్ల య‌జ‌మానులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ ఇండ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments