నేరేడుచర్ల, కేకే మీడియా:
మండలంలోని దిర్శించర్ల గ్రామ ఉర చెరువు లోని సారవంతమైన నల్ల మట్టిని ఇటుక బట్టీల యాజమాన్యం అక్రమంగా తరలించుకొని పోతున్నా మండల స్థాయి అధికారి ఒకరు ఇది అక్రమమని తోలవద్దని చెబుతున్న అక్కడి ఇటుక బట్టి యాజమాన్యం, దళారులు మాత్రం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్న రీతిలో వ్యవహరిస్తూ యదేచ్ఛగా తోలుతున్న, ఫిర్యాదులు అందిన నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు పొలాలకు తోలుకోవలసిన సారవంతమైన నల్ల మట్టిని ఇటుక బట్టీల యాజమాన్యం తమ వ్యాపారం కోసం అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు నాయకులకు ముడుపులు చెల్లించి తరలిస్తున్నారని నీటిపారుదల శాఖ డిఇ అమరందర్ రెడ్డి కి ఫిర్యాదు చేయగా ఆయన తమ సిబ్బందితో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇటుక బట్టీల యాజమాన్యం అడ్డు అదుపు లేకుండా వేలాది ట్రక్కుల నల్ల మట్టిని డంపింగ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటుక బట్టీల యాజమాన్యం అధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పి వారి అండదండలతోనే నల్ల మట్టి అక్రమ దందా సాగిస్తున్నారని రైతులుఆరోపిస్తున్నారు. నల్ల మట్టి అక్రమ దందాకు సహకరిస్తున్న అధికారులు, నాయకులఫై చర్యలు తీసుకోవాలని రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.