హైదరాబాద్ కేకే మీడియా మార్చి 19
తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల ప్రక్షాళన కోసం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణిలో వివిధ రకాల భూ సమస్యల పరిష్కారానికి గానూ ధరణి పోర్టల్‌లోని మాడ్యూళ్లకు సంబంధించి మార్పులు, చేర్పులపై రెవెన్యూ శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. పోర్టల్‌లో నమోదైన సమాచారంలో తప్పులు.. నమోదు కాని భూములను పొందుపరచడం వంటి సాంకేతికపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ధరణి పోర్టల్‌లో ఇప్పటికే 33 మాడ్యూళ్లు ఉండగా.. మరో పది సమాచారం తెలియజేసేవి ఉన్నాయి. ఈ 33 మాడ్యూళ్ల ద్వారా అనేక సమస్యలు, సేవలకు సంబంధించి రైతులు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ‘గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్’, టీఎం-33 మాడ్యూళ్లతో ఏ సమస్య ఉన్నా దరఖాస్తు చేసుకునే వీలుంది. అయితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు చూపే మార్గదర్శకాలు మాత్రం లేవు. దీనికితోడు దరఖాస్తు చేసిన ప్రతిసారీ రూ.వెయ్యికి పైగా రుసుం చెల్లించాల్సి వస్తోంది. వివిధ సమస్యలతో ఇప్పటికే 5 లక్షలకు పైగా వినతులు పోర్టల్‌లో నమోదయ్యాయి. వీటిలో వీలైనన్నింటికీ పరిష్కారాలు చూపారు. సర్వే నంబరులో పేర్కొన్న విస్తీర్ణం కంటే దస్త్రాల్లో ఎక్కువగా నమోదు కావడం, సర్వే నంబరు మిస్సింగ్, విస్తీర్ణం హెచ్చుతగ్గులను సరిచేయడం, కొత్తగా పోర్టల్‌లో ఖాతాను ఏర్పాటు చేయడం తదితర సమస్యలకు మాడ్యూళ్లు లేవు. దాదాపు నలభైరకాల సమస్యలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి సంబంధించి పరిష్కారాలు చూపేందుకు కొత్తగా మాడ్యూళ్లు ఏర్పాటు చేయాలా? లేదా ఉన్నవాటినే సవరించాలా? అనే కోణంలో కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తున్నారు
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ పనిచేస్తోంది. ఐఏఎస్ అధికారులు హైమావతి, రామయ్య, సత్యశారద పెండింగ్ దస్త్రాలను పరిశీలించిన తరువాత భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ ఆ దస్త్రాలపై తుది నిర్ణయం తీసుకుంటున్నారు. త్వరలోనే పెండింగ్ దస్త్రాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. దీంతో దీర్ఘకాలికంగా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు కొంత ఊరట కలగనుంది