మారుతి ఎలక్ట్రిక్ కారు ..
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో టాప్ కంపెనీలు అన్ని కూడా పెట్రోల్, డీజిల్ వాహనాలను కాకుండా ఈవీ కార్లను వరుసగా లాంచ్ చేస్తున్నాయి.అయితే చాలా కంపెనీలు ఈ విభాగంలో ముందడుగు వేయగా, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ(Maruti Suzuki)) మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. ఎప్పటి నుంచో కంపెనీ మొదటి ఈవీ కారు ‘ఈవీఎక్స్(eVX)’ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. భారతదేశంలో మోస్ట్ ఎవైటెడ్ ఎలక్ట్రిక్ కారుగా దీనిని పేర్కొంటున్నారు. గతంలో చాలా సార్లు వివిధ మోటార్ షోలలో eVX ఎలక్ట్రిక్ కారును కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో ఈ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించారు. ఇది సరికొత్త డిజైన్, అదిరిపోయే ప్రీమియం ఇంటీరియర్‌తో వస్తుంది.
eVX ఎలక్ట్రిక్ కారు గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే, దాని బ్యాటరీ , రేంజ్ హైలెట్‌గా ఉంది. ఎందుకంటే ఈ కారులో లేటెస్ట్ సాంకేతికతతో 60 kWh బ్యాటరీ ప్యాక్‌ని అందించారు. ఇది సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 550 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. లాంగ్ డ్రైవింగ్ చేసే వారికి ఈ కారు బాగా సెట్ అవుతుంది.ఈవీఎక్స్‌ను ప్రస్తుతం గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. 2025 జనవరి నాటికి కారు మార్కెట్లోకి విడుదల అవుతుందని సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ మారుతి ఎలక్ట్రిక్ కారు ఆధారంగా టయోటా కంపెనీ సైతం కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని చూస్తుంది. మారుతీ సుజుకీ అభివృద్ధి చేసిన బ్యాటరీ EVల సరఫరాలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెండు కంపెనీలు ఒక ఒప్పందానికి వచ్చాయి.ఇప్పటికే ఈ రెండు కంపెనీలు గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైబ్రిడ్ వాహనాలపై పరస్పరం సహకరించుకున్నాయి. మారుతీ సుజుకీ నుంచి వస్తున్న ఈవీఎక్స్ తరువాత టయోటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది.
మారుతీ సుజుకీ ఈవీఎక్స్ డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే, ఇతర మోడళ్లతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. వెనుకవైపు మొత్తం వెడల్పును కవర్ చేసే LED లైట్ బార్‌లతో వస్తుంది. అధిక-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ర్యాక్డ్ ఫ్రంట్ విండ్‌షీల్డ్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్లో యాంటెన్నాను కూడా పొందుతుంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ చాలా అందంగా ఉంటాయి.
కారు లోపల వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు అనుకూలమైన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీటు కోసం ఎలక్ట్రిక్ అడ్జెస్ట్మెంట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎమ్ వంటి ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ కారులో రానున్నాయి.కారు పొడవు సుమారు 4,300 మిమీ, వెడల్పు 1,800 మిమీ, ఎత్తు 1,600 మిమీ. eVX సింగిల్, డ్యూయల్-ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్ బ్యాగులు, కారు లోపల నుంచే చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, సన్‌రూఫ్, వెనుక AC వెంట్లు వంటి మరిన్నింటిని ఈ కారలో అందించారు.
టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్స్ సహా అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలో తమ మోడళ్లను బలోపేతం చేసుకున్నాయి. కానీ మారుతీ తొలి ఎలక్ట్రిక్ కారు ప్రజలకు ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. అయితే ఈవీఎక్స్‌ను లాంచ్ చేయడం ద్వారా కలను సాకారం చేయడానికి మారుతీ సుజుకీ ప్రయత్నిస్తుంది.