హైదరాబాద్ కేకే మీడియా జూన్ 27
స్వతంత్ర జర్నలిస్ట్ తులసిచందు కు మద్దతుగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ జర్నలిస్టులు అభ్యుదయవాదులు ప్రజా సంఘ నాయకులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు
ప్రశ్నించే గొంతులను కాపాడుకోవల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందని సుప్రసిద్ధ పాత్రికేయులు, మేధావులు, ప్రజా సంఘాల బాధ్యులు పిలుపునిచ్చారు. కిరాయిరాతలతో జర్నలిజాన్ని శాసించేందుకు ప్రయత్నిస్తున్న ట్రోల్ ముఠాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ , హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ , హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్ వర్క్ ఆఫ్ ఒమెన్ ఇన్ మీడియా, తెలంగాణ స్టేట్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్, మేగ్ జైన్స్ అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిజం – ట్రోల్ ముఠాలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టియుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్వతంత్ర జర్నలిస్ట్ తులసీ చందు, ఏపి ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కె. రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, సి. వనజ, ఓయూ జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రోఫెసర్ పద్మజా షా, సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ , సామాజిక కార్యకర్త సజయ, మహిళ సంఘం నాయకురాలు వి. సంధ్య, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మిత్రలతో పాటు దాదాపు 200మంది ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందుకు సమావేశం సంఘీభావం ప్రకటించింది. ప్రశ్నించే గొంతుకలపై జరుగుతున్న దాడులు, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవస్సిందిగా తెలంగాణ డిజిపిని కలిసి వినతిపత్రం సమర్పిద్దామని సమావేశంలో తీర్మాణించారు. అలాగే 39 పౌర, ప్రజా సంఘాలతో కూడిన ఐక్య వేదికగా సోషల్ ప్లాట్ ఫాంగా ఏర్పడదామని తీర్మాణించారు. ఈ సందర్భంగా టియూడబ్ల్యూజె నేత విరాహత్ అలీ మాట్లాడుతూ.. కిరాయిరాతలతో మీడియాను భయపెట్టే ముఠాలకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసునన్నారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయని అన్నారు. ఉన్నది ఉన్నట్లు వార్తలను రాస్తే గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన తెలిపారు. స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు మీద సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని మీడియా మొత్తం మీద జరిగనట్లుగా భావించి ఆమెకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
యాంటీ హిందూ అనే నిందమోపారు – తులసీ చందు
జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో మతం వస్తుంది మేలుకో అనే వీడియో చేసినందుకు తనపై యాంటీ హిందూ అనే ముద్ర వేశారని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను చెప్పడానికే తాము ఉన్నామన్నారు. ఈ మధ్య తాను పెట్టిన నాన్ కంటెంట్ సబ్జెక్టు మీద ఫేస్ బుక్ లో ఎటాక్ జరిగిందన్నారు. తాను ఏ వార్తను సృష్టించలేదని, అయినప్పటికీ తనను శత్రువుగా, అర్బన్ నక్సలైట్, కమ్యూనిక్రుస్టు అని వ్యంగంగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ప్రశ్నించే గొంతులపై దాడులు చేసేవారి వెనుకఉన్న వారెవరో ఆరా తీయాల్సిన అవసరం ఉందన్నారు. తనపై దాడులకు పాల్పడి నాలుగైదు యూట్యూబ్ ఛానల్స్ పై కేసు పెట్టినట్లు ఆమె చెప్పారు. ట్రోలింగ్ ముఠాలను అడ్డుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ నేతలను, ప్రధానమంత్రిని ప్రశ్నించే వారిపై నేరుగా దాడులు చేయాలని పెద్ద వ్యవస్థను పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.
వ్యవస్థీకృత స్థాయిలో ట్రోలింగ్ ముఠాలు – కె.రామచంద్రమూర్తి
వ్యవస్థీకృత స్థాయిలో ట్రోలింగ్ ముఠాలు తయారయ్యాయని సుప్రసిద్ధ జర్నలిస్టు డాక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. నిజం చెప్పేవారిని భయపెడుతున్నారని ఆయన తెలిపారు. మోడీ, కేసీఆర్ అంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పాపులారిటీ బాగా పెరిగిందన్నారు. కర్నాటక ఎన్నికల్లో సోషల్ మీడియా బాగా పనిచేసిందన్నారు.
ఇండిపెండెంట్ జర్నలిజం ప్రాచుర్యం పొందింది – దేవులపల్లి అమర్
సోషల్ మీడియా వెలుగులోకి వచ్చాక ఇండిపెండెంట్ జర్నలిజం విస్త్రతంగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. గతంలో వార్తపత్రికలు మాత్రమే ఉన్నప్పుడు వ్యతిరేకంగా వార్తలు రాస్తే సంబంధిత బాధితుడు సంపాదకులకు ఫిర్యాదు చేసేవారని అన్నారు. ఇప్పుడు ఏ సంపాదకుడి కట్టడి లేకుండా ఇండిపెండెంట్ జర్నలిజం సాగుతుందన్నారు.
సోషల్ మీడియా మీదే ఎందుకు దాడులు – జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి
సోషల్ మీడియ మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టు అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలను ఎవరు జీర్ణించుకోలేరో వారే మీడియాపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు.
నైతిక విలువలు నాశనం అయిపోయాయి – ప్రోఫెసర్ హరగోపాల్
సమాజంలో మహిళపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న వేళ నైతిక విలువలు నాశనం అయిపోయాయని అన్నారు. సమాజ మార్పు కోసం పోరాటం చేస్తున్న మహిళలపై దాడులు జరగడం అన్యాయమని అన్నారు. మహిళలకు మెరుగైన జీవితం, విలువల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇండిపెండెంట్ వాయిస్ ను కాపాడాలి – పాశం యాదగిరి
ఇండిపెండెంట్ వాయిస్ ను కాపాడాలని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పిలుపునిచ్చారు. ప్రజల వాయిస్ సోషల్ మీడియా వేదికగా ఇండిపెండెంట్ జర్నలిజం ద్వారా వినిపిస్తుందన్నారు. జర్నలిజంలో క్రిటిక్ థాట్ అనేది లేకుండా చంపివేయడానికి ట్రోలింగ్ ముఠాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.
చెప్పినమాట వినకపోతే దాడులు – ప్రోఫెసర్ పద్మజా షా
చెప్పినమాట వినని వారిపై అసహనంతో ప్రభుత్వాలు సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఓయూ జర్నలిజం మాజీ అధిపతి ప్రొఫెసర్ పద్మజా షా ఆరోపించారు. ఈ నేపథంలో ప్రతిభవంతులైన జర్నలిస్టులు యూట్యూబ్ లు వేదికగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజాధనంతో లేనివి ఉన్నట్లుగా ప్రభుత్వాలు ప్రోపగండ చేస్తున్నాయని అన్నారు. డబ్బులు తీసుకుని అవాస్త వార్తలను ప్రచురిస్తున్నారనే నిందలు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మనిషి అభిప్రాయాలను ఎందుకు సహించరు ? జర్నలిస్టు సజయ
మనిషి అభిప్రాయాలను ఎందుకు సహించలేకపోతున్నారని సీనియర్ జర్నలిస్టు సజయ ప్రశ్నించారు. చాకలి ఐలమ్మ వారసులుగా జర్నలిస్టులుగా నిలబడతామని అన్నారు. జర్నలిస్టుగా ఎథిక్స్ పాటిస్తామని అన్నారు.
పెద్ద శక్తులే పనిచేస్తున్నాయి – సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్
ట్రోలింగ్ ముఠాలు వెనుక పెద్ద శక్తులే పనిచేస్తున్నాయని సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్ అన్నారు. భౌతికంగా మనుషులపై దాడులకు, ట్రోలింగ్ ముఠాలకు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదన్నారు. ఇండిపెండెంట్ జర్నలిజంను ప్రజా జర్నలిజంగా ఆహ్వానించాలని సూచించారు. ప్రభుత్వాలు నియంతృత్వంతో భావప్రకటన స్వేచ్ఛను అణచివేస్తున్నాయని అన్నారు.
ట్రోలింగ్ ముఠాలపై కేసు పెట్టాలి ః ఎన్ డబ్ల్యూ ఎంఐ బాధ్యులు వనజ
ట్రోలింగ్ ముఠాలపై కేసు పెట్టాలని ఎన్ డబ్ల్యూ ఎం ఐ బాధ్యుుల వనజ సూచించారు. కేసులు పెట్టిన తర్వాత ఏమీ జరగకపోతే అవతలవాళ్ళకు లోకువ అవుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై డిజిపిని కలిసి వినతిపత్రాలు సమర్పించాలని కోరారు. తెలంగాణలో ట్రోలింగ్ ముఠాలకు వ్యతిరేకంగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. సంస్కార రహితంగా కనిపించిన ట్రోలింగ్ లను ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు.
ఇండిపెండెంట్ మీడియాను కాపాడాలి – సీనియర్ ఎడిటర్ వేణుగోపాల్
ఇండిపెండెంట్ మీడియాను కాపాడాలని సీనియర్ సంపాదకులు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్ జర్నలిజం వెలుగులోకి వచ్చాక ఒత్తిడి లేకుండా తోచిన విధంగా అభిప్రాయాన్ని తెలిపే అవకాశం వచ్చిందన్నారు. తులసీ చందు శక్తివంతమైన జర్నలిస్టు కాబట్టే ఆమెపై దాడి జరిగిందన్నారు. ఏది న్యాయమే ఏది ధర్మమో గుర్తించే స్థాయిలో తులసీ ఉన్నారని అన్నారు. మహిళా జర్నలిస్టులు, స్త్రీలపై విఫరీతమైన ట్రోలింగ్ లు రావడం దారుణమన్నారు.
ఆర్గనైజ్డు ట్రోలింగ్ – మహిళా సంఘం నేత సంధ్య
అర్గనైజ్డు ట్రోలింగ్ ను అరికట్టాలని మహిళ సంఘం నేత వి. సంధ్య డిమాండ్ చేశారు. కాషాయి మూకల దాడులను తులసీ బాగా ఎండగడుతుందని ప్రసంశించారు. తులసీ ఒంటరికాదని ఆమె వెనుక తామున్నామని అన్నారు. ఈ మధ్యకాలంలో 72 కులదురాహంకార హత్యలు జరిగాయనిచెప్పారు. హిందువులు హిందువులను చంపితే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ఆమె ప్రశ్నించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు పద్మ వంగ, లక్ష్మణరావు, కృష్ణమూర్తి, బాలరెడ్డి, ప్రసాద మూర్తి, కార్టునిస్టు నరసింహం, డాక్టర్ మిత్ర, హిప్నో పద్మ కమమలాకర్, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ బాధ్యుడు బాన్సువాడ నాని, పివోడబ్ల్యూ నేత సంధ్య, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నేత కరుణాకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక నేత అంబటి నాగయ్య, తెలంగాణ టీచర్స్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ నేత వై. అశోక్ కుమార్, దళితబహుజన ఫ్రంట్ నేత శంకర్, తెలంగాణ రచయితల వేదిక ఇనిశెట్టి శంకర్, మహిళా ట్రాన్స్ జెండర్ జేఏసీ బాధ్యులు దేవి, కులనిర్మూలన సంఘం నేత జి. జ్యోశ్న, గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భరత్ తదితర ప్రజా సంఘాల నేతలు పాల్గొని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందుకు సంఘీభావం పలికారు.
అంబటి అంజనేయులకు ఘన నివాళి
రెండు రోజుల క్రితం మృతి చెందిన ఐజెయు సీనియర్ నాయకులు , వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ నేత అంబటి ఆంజనేయులుకు సమావేశం ఘనంగా నివాళులర్పించింది. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అంబటి అమర్ హై అని నినదించారు.