హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 23:
గడ్డం పెంచిన వాళ్ళందరూ గబ్బర్ సింగ్l లు కాలేరని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు హుజూర్నగర్ లో రోడ్ షోకు విచ్చేసిన సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎన్నికల్లో గెలవకుంటే గడ్డం తీసుకోనని శపథం చేసిన ఉత్తం గడ్డం పెంచుకుంటూ పోయారే తప్ప అధికారం రాలేదని అయినా గడ్డం పెంచిన వాళ్ళందరూ గబ్బర్ సింగ్ లేనా అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పథకాలు మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ అని గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తం ఉన్నప్పుడు ఎన్ని కోట్ల స్కాం జరిగిందో మీకు తెలుసు కదా అన్నారు. రైతు బంధు వృధా పథకమని అన్న ఉత్తంకావాలో రెండు సంవత్సరాల్లో వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన సైదిరెడ్డి కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. మూడు గంటల ఉచిత కరెంటు చాలని చెప్పే కాంగ్రెస్ పార్టీ కావాలా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ కావాలా ఆలోచించుకోనీ ఓటు వేయాలన్నారు. మళ్లీ మనం అధికారంలోకి వస్తే పెన్షన్ల పెంపు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ, వచ్చే మార్చి నుంచి రైతుబంధు పెంపు, 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలనెలా 2500 రూపాయల పథకం, అన్ని వర్గాల ప్రజలకు ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఇలాంటి ఎన్నో పథకాలు అందించే బిఆర్ఎస్కె ఓటు వేయాలని కోరారు.
సైదిరెడ్డికి ఎమ్మెల్యేగా పూర్తి కాలం అవకాశాలు లభించలేదని 4000 కాలపరిమితిలో రెండు సంవత్సరాలు కరోనా లో గడిచిపోయిన నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన ఉత్సాహవంతుడని , మరొకసారి అవకాశం కల్పిస్తే నా కుటుంబ సభ్యుడైన సైదిరెడ్డికి చుట్టూ ఉన్న ఫ్యాక్టరీల లో ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తో పాటు, నూతన ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, చేయిస్తానని హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అధ్యక్ష వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగులు లింగయ్య , తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, రమణ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసిలు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు భారీ సంఖ్యలో జన సమీకరణ నిర్వహించారు.