కమ్యూనిస్టు పార్టీకి నష్టం చేసేది నాయకులే ?
హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 11:
భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలతో మొదలై నాయకత్వ విభేదాలతో చీలికలు పేలికలుగా మారి అనైక్యతతో ఎవరి దారి వారిదే అన్నట్టుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ తమ ఉనికిని కాపాడుకుంటూ పార్టీ ప్రభావాన్ని చూపుతూ వస్తున్న క్రమంలో పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఎల్ డి ఎఫ్ పేరుతో ఆయా రాష్ట్రాలను పాలించే స్థాయికి ఎదిగి ప్రస్తుతం కేరళకే పరిమితమైన అధికారం జాతీయస్థాయిలో ప్రాధాన్యత చూపటంలోనూ తగ్గుముఖం పడుతూ వస్తోంది.
కమ్యూనిస్టు ప్రభావం దేశంలో రాష్ట్రాల్లో తగ్గిపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే. అనాలోచిత నిర్ణయాలు ఆధిపత్య పోరు, దీర్ఘ కాలిక తమ తమ స్థానాలపై వ్యామోహం కొన్ని వర్గాల ప్రజలకే ఉపయోగపడేలా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కొత్త క్యాడర్ను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైపోయారు. ఉన్న క్యాడర్ను కాపాడుకోవడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందారు.
ప్రతి మూడు సంవత్సరములకు ఒకసారి గ్రామస్థాయి నుండి జాతీయస్థాయి వరకు నాయకత్వ మార్పు కోసం సభలు, సమావేశాలు, నిర్వహించి చేసిన తప్పులను సమీక్షించుకొని అలా చేసి ఉండకూడదు అని తప్పిదాలను వల్ల వేసుకోవడమే తప్ప జరిగిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయడంలో వైఫల్యం కమ్యూనిజం వెనుకబాటుతనానికి ప్రధాన కారణం అవుతుంది.
విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ప్రత్యామ్నాయ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ స్థాపనకు ముందు ప్రభావం చూపిన కమ్యూనిస్టు పార్టీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రాతినిధ్యం దిగజారుతూ వచ్చింది. జాతీయ స్థాయి రాజకీయంలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాలు కొన్ని సీట్లకు పరిమితం కావచ్చేమో కానీ పక్క పార్టీ వారి బుద్ధులను అలవర్చుకొని వారిలాగా మారే నాయకులను తయారు చేశారే తప్ప నిజమైన వారసత్వాన్ని తయారు చేసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు.
తెలంగాణ విషయానికి వస్తే ఒక కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా, మరో పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించాయి.తెలంగాణలో మనుగడ కోసం ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకత్వం మాత్రం కలిసి నడుద్దామని ప్రకటనలు, కొన్ని ప్రాంతాల్లో బద్ధ శత్రువులుగా ఒకరిని మరొకరు ఓడించుకునే స్థాయిలో పనిచేస్తూ వచ్చారు.
ప్రస్తుత ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక్క సీటును గెలుచుకోగా , సిపిఎం తన బలాన్ని చూసుకోకుండా పోటీలో నిలబడి చావు దెబ్బ తగిలించుకొని తిరిగి కాంగ్రెస్కి మద్దతు ప్రకటించడం సర్వత్ర అభిమానులు పార్టీ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
సిపిఎం పార్టీలో భిన్న స్వరాలు నాయకత్వ లోపం విద్యార్థి ఉద్యమ నాయకుల మొదలు యువజన, రైతాంగ ,కార్మిక, కర్షక పార్టీ సీనియర్ నాయకులను ఎదిగే దశలోనే వారి ప్రభావాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసి పార్టీలు మారేలా పొమ్మన లేక పొగ పెట్టిన సందర్భంగా చేయడంతో నిబద్ధతతో ఆశయంతో స్ఫూర్తితో పని చేసే ఎంతోమంది నాయకత్వం పక్క పార్టీలకు మారారు, కొందరు రాజకీయాన్ని వదిలి సొంత పనులు చూసుకునే పరిస్థితి వచ్చింది.
పార్టీ ఎదుగుదలకు దీర్ఘకాలిక పార్టీ పదవుల ఆకాంక్షలో ఉన్న నేతలే అవాంతరాలుగా మారారన్న విమర్శలు సర్వత్రావ్యక్తం అవుతున్నాయి. తాము చేయరు ఇతరులను చేయనీయరు అన్నచందంగా వారి వ్యవహార శైలి పార్టీ కార్యకర్తలను అభిమానులను ఎంతో నైరాశ్యానికి గురిచేశాయి.
కమ్యూనిస్టులపై ప్రేమతో వారు చేసే కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందించే కొందరు పార్టీ ఎదుగుదల కోసం సహకారం అందిస్తూ వస్తుండగా వాటి కోసమే నాయకులుగా చలామణి అయ్యే కొందరి వల్లే పార్టీకి దుస్థితి ఏర్పడిందని బాహాటంగానే పార్టీ నుంచి బయటికి వెళ్లిన నేతలు విమర్శిస్తున్న పరిస్థితి.
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర జాతీయ నాయకుల సైతం గ్రామీణ ప్రాంతాల వరకు వచ్చి గ్రామ బాట పట్టి పార్టీని పటిష్టపరిచే పరిస్థితులు పోయి ఇప్పుడు ఏసీ కార్లు ఏసీ గదులకు పరిమితమై వారి ఆలోచనలకు అనుగుణంగా దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా మేమున్నాం అనే సంకేతాలు ఇస్తున్నారు తప్ప పార్టీని పునర్ వైభవం తీసుకొచ్చేందుకు గో టు పీపుల్ అనే నినాదాన్ని పూర్తిగా విస్మరించారని, ఇలానే కొనసాగితే ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉండేవారు అన్న మాటలు చెప్పుకోవలసిన దుస్థితికి వెళ్లే ప్రమాదం ఉందని కమ్యూనిస్టు అభిమానులు వాపోతున్నారు.
ఇకనైనా నాయకులు సత్యాన్ని గ్రహించి పార్టీని బతికించే ప్రయత్నం చేస్తారో లేదో వేచి చూడాలి మరి.