Saturday, June 14, 2025
HomeAndhra Pradeshఏపీలో కొత్త కేబుల్ బ్రిడ్జి

ఏపీలో కొత్త కేబుల్ బ్రిడ్జి

ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే?

ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను శరవేగంగా జరపాలని భావిస్తోంది. ఈనెల 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.

గత పది నెలలుగా నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అవి కొలిక్కి రావడంతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది. ప్రపంచ నగరాల్లోనే అమరావతిని ఉత్తమంగా నిలపాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. అందులో భాగంగా కీలక నిర్మాణాలను చేపడుతోంది. మరో తాజా నిర్ణయం తీసుకుంది. అమరావతి ముఖద్వారంగా ఉండే ప్రకాశం బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు రోడ్డు నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించింది. అత్యాధునిక హంగులతో కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ రహదారి పూర్తయితే విజయవాడ, గుంటూరు నుంచి అమరావతికి సులభంగా చేరుకోవచ్చు. ఈ రోడ్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

* త్వరలో మూడో దశ పనులు..

రాజధాని లోని సీడ్ యాక్సిస్ రోడ్డు ( seed Axis Road )మూడో దశ పనులు త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు. దీనికోసం 593 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇదే రోడ్డు చెన్నై-కోల్కత్తా నేషనల్ హైవే ను కనెక్ట్ చేయనుంది. అమరావతి అభివృద్ధి సంస్థ రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు పిలవనుంది. ఈ మేరకు ఇక్కడ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను నిర్మిస్తారు. మూడో దశ రహదారి ప్రకాశం బ్యారేజీ నుంచి పాత మద్రాసు రహదారి మీదుగా వెళ్లనుంది.

* 320 మీటర్ల కేబుల్ బ్రిడ్జి
అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మార్గంలో ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జిని( cable Bridge) కూడా నిర్మించాలని ప్రణాళిక వేసింది. ఈ మేరకు టెండర్లను కూడా పిలవాలని భావిస్తున్నారు. 320 మీటర్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 48 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ రహదారిని రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేతో కలిపే చోట మూడు రాంపులను నిర్మిస్తారు. అమరావతిని విజయవాడ వైపు వెళ్లడానికి 232 మీటర్ల ర్యాంపు ఉండనుంది. గుంటూరు నుంచి అమరావతి కు వెళ్లడానికి 280 మీటర్ల ర్యాంపు ఉంటుంది. విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్లేందుకు 115 మీటర్ల ర్యాంపు ఉండనుంది. అలాగే 1.52 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు.

* బంకింగ్ హోమ్ కెనాల్ పై
పాత చెన్నై హైవేలో బంకింగ్ హోమ్ కెనాల్ పై ( bunking home Canal )320 మీటర్ల పొడవు ఉండే కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ లో భాగంగా 99.6 మీటర్ల పొడవైన రైలు ఓవర్ బ్రిడ్జి కూడా ఉంటుంది. ఇదే రోడ్డులో మరో మేజర్ బ్రిడ్జి, రెండు మూడు వెహికల్ అండర్ పాసులు కూడా నిర్మిస్తారు. అయితే టిడిపి ప్రభుత్వ హయాంలో గతంలోనే దొండపాడు నుంచి మణిపాల్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. 14 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు 4.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ సమస్యల కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన నేపథ్యంలో మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నాలుగు కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులను చేపట్టాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. భూ సేకరణలో సమస్యలు లేకుండా.. ప్రస్తుతం రైతులతో అధికారులు మాట్లాడుతున్నారు. ఇవి కొలిక్కి వచ్చిన మరుక్షణం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments