Monday, January 13, 2025
HomeNationalఎమ్మెల్సీ కవితకు షాక్

ఎమ్మెల్సీ కవితకు షాక్

ఢిల్లీ కేకే మీడియా మార్చి 19
సుప్రీంకోర్టు లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకు ఈడీ విజ్ఞప్తి చేసింది. ఈనెల 24న కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కేవియట్ పిటిషన్ దాఖలుతో కవిత తరపు వాదనలు, ఈడీ తరపు వాదనలు సుప్రీంకోర్టు విననుంది. ఈడీ తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా… 24న విచారిస్తామని కోర్టు తెలిపిన విషయం తెలిసిందే. మార్చి 16న ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే ఈ నెల 24 న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ విచారణ జరిగేంత వరకూ ఆగాలని కవిత చేసిన అభ్యర్థనను ఈడీ తోసిపుచ్చింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడా పేర్కొనలేదని అందులో ప్రస్తావించారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లానని గుర్తు చేశారు. దర్యాప్తు న్యాయపరంగా, చట్టప్రకారం జరగడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఈ నెల 24 తన కేసు విచారణకు స్వీకరించే దాకా వేచి చూడాలని, ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని, లేకపోతే తనకు ఈ-మెయిల్‌ చేయవచ్చని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు.

సాధ్యమైనంత వరకు ఈడీ దర్యాప్తు తప్పించుకోవాలని కవిత ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులైన అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఆడిటర్‌ బుచ్చిబాబులను ముఖాముఖి కూర్చోబెట్టి ఒకరు చెప్పిన సాక్ష్యాలను మరొకరితో ధ్రువీకరింపచేయాలని, అనంతరం అరుణ్‌ పిళ్లైని కవితతో ముఖాముఖి కూర్చోబెట్టి వాస్తవాలను అంగీకరింపచేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఈ దఫా విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments